తెలంగాణలో కాంగ్రెస్ కు బానే డిమాండ్ ఉందిగా

ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 సీట్లే వచ్చాయి. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి వంటి వారు చెప్పినా ఎన్నికలు వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ ను పూర్తి నిరాశానిస్పృహలలోకి నెట్టేసింది. ఆ దెబ్బ నుండి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేశాయి. నీరసంగానే ఆ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

రాష్ట్రంలోని 17 లోక్‌సభస్థానాలకు ఈ నెల 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం ముగిసింది. 320 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వుడ్‌ నియోజకవర్గాలైన నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో భారీగా డిమాండ్‌ ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 25కిపైగా దరఖా స్తులు వచ్చినట్టు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ వీటిని పరిశీలించి ఈ నెల 20లోపు నియోజకవర్గానికి 1 లేదా 2, అనివార్యమైతే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నట్లు సమాచారం. కనీసం నాలుగైదు సీట్లయినా గెలిచి పరువు నిలుపుకోవాలని పార్టీ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ ను ఖాతా ఓపెన్ చెయ్యనివ్వకూడదని టీఆర్‌ఎస్‌ కృతనిశ్చయంతో ఉంది.