సైరా.. కొత్త క్లైమాక్స్?

syee-raa-new-climax

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో సంచలనంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం సైరా. ఉద్యమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రానికి సంబంధించి తాజా కథనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉద్యమయోధుడి కథ విషాదాంతంగా ముగిసిన నేపథ్యంలో, చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క్లైమాక్స్‌లో కొద్దిమార్పులు చేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. సినిమాటిక్‌గా కొంత లిబర్టీని తీసుకుని, కథకు కొనసాగింపు చూపించే అవకాశం ఉందని పరిశ్రమలో వినిపిస్తోంది.

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా శరవేగంగా తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రంలో కొన్ని కల్పనలనూ జోడిస్తున్నారన్నదే లేటెస్ట్ టాక్.క్లైమాక్స్ విషయంలో పలురకాలుగా ఆలోచించి, చిత్ర బృందం చివరికి ఓ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. వాస్తవ కథ ఆధారంగా చిత్రాన్ని చేస్తే.. కథను విషాదాంతంగా ముగించాలి. ఎందుకంటే నరసింహారెడ్డిని బ్రిటీష్ సైన్యం ఉరితీసి కోట గుమ్మానికి ఆయన తలను వేలాడదీసింది. అచ్చంగా ఇలాగే క్లైమాక్స్ తీస్తే అభిమానులతోపాటు ప్రేక్షకులూ నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అందుకే నరసింహారెడ్డి చావుతోకాకుండా ఆయన స్ఫూర్తితో మళ్లీ ఎవరెవరు తిరుగుబాటుకు దిగారన్న అంశాలతో తర్వాతి కాలంలోని విప్లవకారులను చూపిస్తూ కథకు కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు కాలంనాటి విప్లవకారులను స్క్రీన్‌పై చూపిస్తూ కథను మగించే అవకాశం లేకపోలేదు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

రచయితగా కెరీర్ మొదలెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతి కొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న చిత్రంలో చిరు రైతు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంతకాలంగా కొరటాల వెదుకులాట సాగించాడు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం కొరటాల -చిరు కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాని తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నాకి సినిమాలు తగ్గాయి. ఈ సమయంలో చిరు ప్రక్కన నటిస్తే ఆమె కెరీర్‌కు అది ప్లస్ అవుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కాబోతోందని సమాచారం.