ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే మొదలయిన డబ్బు ప్రవాహం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రెండున్నర నెలల లోపే ఉంది. అయితే ఈ లోపే రాజకీయ పార్టీలు డబ్బు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో డబ్బు తరలిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి వద్ద పోలీసుల తనిఖీల్లో 1.27 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. డబ్బు తరలిస్తున్నవారు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నగదు తీసుకెళ్తున్నామని చెబుతూనే పొంతన లేని సమాధానాలతో చెప్పటంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్నదానిపై కూపీ లాగుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ 250 కోట్ల డబ్బు పట్టుకున్నారు. అందులో సగం డబ్బు రెండు తెలుగు రాష్ట్రాలలోనే పట్టుబడింది. ఈ సారి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 250 కోట్లకు పైగా డబ్బు పట్టుబడుతుందని విశ్లేషకుల అంచనా.